పి.గన్నవరం(ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. లోకల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు తలొగ్గితే వేటు తప్పదని రుజువైంది. పూర్తి వివరాల్లోకి వెళితే పి.గన్నవరం ఎంపీడీవోగా పనిచేస్తున్న కె.వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. పి.గన్నవరం మండంలో ఆదివారం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేవలం రెండో డోసు వారికిమాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ఇదివరకే కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఎవరైనా మొదటి డోసు వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా కోవాక్సిన్ విషయంలో రెండో డోసు వేసుకున్నవారికి సమయం గడిచిపోతున్నా వ్యాక్సిన్ అందకపోవడంతో కలెక్టర్ కేవలం రెండో డోసువారికి మాత్రమే అవకాశం కల్పించాలని ముందుగానే ఆదేశాలు జారీ చేశారు.
పి.గన్నవరం ఎంపీడీవో స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సును పరిగణలోకి తీసుకుని మొదటిసారి డోసు వేసుకునే వారికి అవకాశం కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు ఆగ్రహాం తెప్పించింది. జాయింట్ కలెక్టర్ ద్వారా నివేదిక తీసుకున్న కలెక్టర్ వెను వెంటనే ఎంపీడీవో వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. అయితే లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యే,ఎంపీలను ఖాతరు చేయకపోతే స్థానికంగా సమస్య వస్తుందన్న కారణంతో అధికారులు నిబంధనలు పట్టించుకోవడ లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. పి.గన్నవరం ఎంపీడీవో విషయంలో కూడా ఒత్తిడి ఎక్కువ రావడంతో ఆయన మొదటి డోసుకు అవకాశం కల్పించారు. ఈవిషయంలో ఎంపీడీవోపై చర్య తీసుకోవడంలో జిల్లా కలెక్టర్ మాత్రం ఉపేక్షించకపోవడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా వ్యాక్సినేషన్లో రెండో డోసు వారిని విస్మరించి మొదటసారి డోసు వేయండలో అత్యుత్సాహాం ప్రదర్శించిన దవళేశ్వరం హెడ్ వర్క్స్ సీనియర్ అసిస్టెంట్ డి.సూర్యప్రకాష్‌పై నా సస్పెన్షన్ వేటు పడింది.