ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం..నిమిషాల వ్యవధిలో 11 మంది మృతి
తిరుపతి (ADITYA9NEWS): తిరుపతి రుయా ఆసుపత్రిలో అనూహ్యంగా జరిగిన పరిణామంతో 11 మంది మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గడంతో ఊపిరాడక వందల మంది కొట్టుమిట్టాడారు. ఈలోగా 11మంది చనిపోవడంతో అక్కడంతా ఆందోళన మొదలైంది. సోమవారం రాత్రి 8.30 నిమిషాల సమయంలో జరిగిన ఈఘటనతో అధికారులు సైతం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆక్సిజన్ సరఫరాను వెంటనే పునరుద్ధరించడంతో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న రోగులకు ప్రాణవాయువు అందింది.
అయితే చనిపోయిన మృతుల బంధువులు ఆసుపత్రిలో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా భయంకర వాతావరణం నెలకొంది. డాక్టర్లు, నర్సులు గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొంత మంది ఆసుపత్రి ప్రాంగణం వదిలి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి రుయా ఘటనపై ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు . సుమారు 1000 మంది రోగులకు వైద్య సేవలు అందించే సామర్థ్యం ఉన్న రుయా ఆసుపత్రిలో 700 మంది రోగులకు అందించే ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. 30 మంది డాక్టర్ల పర్యవేక్షణలో నిర్వాహణ జరుగుతోంది.