మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
జై తెలంగాణ న్యూస్ ( జాతీయం )
ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ వివాదంలో చిక్కుకుంది. దాని వార్తా మాద్యమం అయిన డీడీ న్యూస్ లోగో రంగు మార్చడమే ఇందుకు కారణం. గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా.. ఇటీవల దాన్ని కాషాయ (ఆరెంజ్) రంగులోకి మార్చారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడిరచింది. మా విలువలు అలానే ఉన్నాయి. కానీ, ఇక నుంచి మేం కొత్త అవతార్‌లో అందుబాటులో ఉంటాం. కొత్త ప్రయాణానికి సిద్ధం కండి అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అయితే, ఈ లోగోను బిజెపి జెండా రంగు అయిన కాషాయంలోకి మార్చడంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ సాధించేందుకు బిజెపి చేస్తున్న కుట్ర ఇది. జాతీయ ప్రసార సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నమే అని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు.
అటు దూరదర్శన్ మాతృక సంస్థ ప్రసారభారతి (డీడీ, ఆల్ ఇండియా రేడియో) మాజీ సీఈవో జవహర్ సిర్కార్ కూడా ఈమార్పును తప్పుబట్టారు. దూరదర్శన్ తన న్యూస్ లోగోను కాషాయంలోకి మార్చింది. ఈ నిర్ణయంతో ఇది ప్రసార భారతి కాదు. ప్రచార భారతి అనే భావన కలుగుతోంది అని విమర్శించారు. అయితే దీనిపై ప్రసార భారతి ప్రస్తుత సిఈఓ గౌరవ్ ద్వివేది స్పందిస్తూ లోగో మార్పును సమర్ధించారు. దృశ్య సౌందర్యాన్ని మరింత పెంచేందుకు రంగును మార్చామని, దీనిపై విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు. 1959 సెప్టెంబర్ 15న తొలిసారి దూరదర్శన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత దీన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కిందకు తీసుకురాగా.. జాతీయ బ్రాడ్‌కాస్టర్‌గా మారింది. అనంతరం డీడీ నెట్‌వర్క్ కింద అనేక ఛానళ్లను తీసుకొచ్చారు. ప్రస్తుతం దూరదర్శన్‌లో ఆరు జాతీయ, 17 ప్రాంతీయ ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి. గతంలో పలుమార్లు దీని లోగో రంగులను మార్చారు. నీలం, పసుపు, ఎరుపు ఇలా పలు రంగుల్లో కనిపించినప్పటికీ.. గ్లోబ్ చుట్టూ రెండు రేకల డిజైన్ మాత్రం మారలేదు.