ఆవు పై దాడి చేసిన నిందితుల అరెస్ట్
జై తెలంగాణ న్యూస్, మంచిర్యాల జిల్లా బ్యూరో ఏప్రిల్ 26:-
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల రంగంపేట గ్రామ శివారులోని ఉప్పర్ల చెరువు దగ్గరలో ఒంటరిగా గడ్డిమేస్తున్న ఆవుపై గొడ్డలితో దాడి చేసి, ఆవు నాలుగు కాళ్ళను నరికి వేసిన నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలూద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాల గురజాలకు చెందిన చల్లూరి దయాకర్ తన ఆవును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి, ఆవు నాలుగు కాళ్ళు నరికివేసారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. కేసు దర్యాప్తులో గతంలో ఇటువంటి నేరాలకు పాల్పడిన మాల గురజాల కు చెందిన దుగుట వెంకటస్వామి, దుగ్నపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కళ్యాణ్ అను అనుమానితులను విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారన్నారు. నేరస్తులు గతంలో ఆవులను, ఎద్దులను దొంగతనం చేసి, వాటిని కోసి, వాటి మాంసాన్ని గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి, డబ్బులు సంపాదించే వారు అని, ఇదే క్రమంలో ఏప్రిల్ 23న దుగుట వెంకటస్వామి, కుమ్మరి కళ్యాణ్ నిందితులు ఇరువురు కుమ్మరి కళ్యాణ్ ఇంటి నుండి గొడ్డలి, కత్తిని తీసుకొని, స్కూటీపై ఇద్దరు కలిసి ఆకుదారి చంద్రశేఖర్ ను బట్వాన్ పల్లి గ్రామం దగ్గర స్కూటీ పై ఎక్కించుకొని, ముగ్గురు కలిసి రంగంపేట గ్రామ శివారులోని ఉప్పర్ల చెరువు దగ్గర ఒంటరిగా గడ్డి మేస్తున్న ఆవును చూసి, పట్టుకుని, గొడ్డలితో ఆవు నాలుగు కాళ్ళు నరికి, తర్వాత ఆవు ను చెట్ల పొదల్లో ఉంచేసి, ఆవు చనిపోయాక రాత్రి వచ్చి, దాన్ని మాంసం కోసుకొని, అమ్ముకుందామని అనుకున్నారని వివరించారు. నేరస్తులపై గతంలో ఇటువంటి నేరాలు పలు పోలీస్ స్టేషన్లో నమోదు అయ్యాయని తెలిపారు. ఈ మేరకు నేరస్తులపై కేసు నమోదు చేసి, నేరస్తుల నుండి గొడ్డలి, కత్తి, రెండు కొబ్బరి తాళ్లు, స్కూటీని స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. మూగజీవాలను చంపిన, వాటిపై దాడులు చేసి, గాయపరిచిన, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ల గురజాల ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.