సింగరేణి కార్మికుల పని వేళలు మార్చండి
జై తెలంగాణ న్యూస్, మంచిర్యాల జిల్లా బ్యూరో:-
వేసవికాలం అధిక ఉష్ణోగ్రతలతో సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, అనారోగ్యం పాలు అవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి, కార్మికుల పని వేళలు మార్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ యాజమాన్యం ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ సంఘానికి గుర్తింపు పత్రం ఇవ్వలేదని, దీంతో నిర్ణయాత్మక సమావేశాలు జరగక కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆరోపించారు. వేసవికాలం ఎండ అధిక ఉష్ణోగ్రతలతో కార్మికులు అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు యాజమాన్యం వెంటనే పని వేళలు మార్చాలని కోరారు. ఏరియా యాజమాన్యాన్ని కోరిన పట్టించుకోవడంలేదని,కార్పొరేట్ నుండి ఆదేశాలు రావాలని మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. అధిక ఉష్ణోగ్రతలకు ఓర్చి సింగరేణి కార్మికులు కష్టపడి విధులు నిర్వహిస్తున్నారని, పనివేళలో మారిస్తే ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని కోరినప్పటికీ, ఏసీ గదుల్లో కూర్చుండే అధికారులు స్పందించడం లేదని, దీనితో కార్మికులపై వారికున్న శ్రద్ధ తేటతెల్లమవుతుందని విమర్శించారు. వేసవి తాపానికి కార్మికులు అనారోగ్యం పాలై, వారికి ఏమైనా జరిగితే సింగరేణి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓసీపీలలో వాటర్ స్ప్రే కొరకు మూడు ట్యాంకర్ల నడపాల్సి ఉండగా కేవలం ఒక్క ట్యాంకర్ తోనే వాటర్ స్ప్రే చేయించడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి, కార్మికుల పని వేళలు మార్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.