ఆస్తి కోసం కన్న తండ్రిపై పాశవిక దాడి.. రెండు నెలలు ఆస్పత్రిపాలై మృతి..
జై తెలంగాణ న్యూస్ ( క్రైమ్ విభాగం )
కన్న తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పిల్లలు ఎదిగినా కొద్ది సంతోషంతో మురిసిపోతుంటారు. అప్పు చేసైనా సరే అడిగినవన్నీ కొనిపెడుతారు. తాము పస్తులుండైనా సరే బిడ్డల కడుపు నింపుతారు. అంతచేసినా తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏం కోరుకుంటారు..? బతుకడానికి బుక్కెడు బువ్వ..! ప్రేమగా పిలిచే అమ్మా.. నాన్నా అనే పిలుపు..! మనకు రెక్కలొచ్చేదాకా నానా కష్టాలు పడి పెంచి పోషించిన తల్లిదండ్రులకు ఆమాత్రం తిరిగివ్వలేమా..?
కన్నవాళ్లకు బువ్వ పెట్టి, ప్రేమగా పలుకరించడం మాటేమోగానీ తమిళనాడులో ఓ కొడుకు మాత్రం కన్న తండ్రిపై పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ఆస్తి కోసం డిమాండ్ చేస్తూ.. సోపాలో కూర్చుని ఉన్న తండ్రి ముఖంపై ముష్టిఘాతాలు కురిపించాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వచ్చి పిడిగుద్దులు గుద్దాడు. అంతటితో ఆగక కాలితో ముఖంపై బలంగా తన్ని వెనక్కి వెళ్లాడు. దాంతో తండ్రి స్పృహతప్పి సోఫాలో ఒరిగిపోయాడు. అయినా మరోసారి దాడి చేస్తేందుకు వస్తుండగా ఓ వ్యక్తి అడ్డుకుని పక్కకు తీసుకెళ్లాడు.
ఈ హృదయవిధారకమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్న తండ్రిపై పాశవికంగా దాడి చేసిన కొడుకుపై నెటిజన్‌లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి కొడుకులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.