రాజయ్యతో రహస్య మంతనాల వెనుక అసలు కిటుకేమిటో.
నేతలు పార్టీల ఫిరాయింపులంటూ..తెలంగాణాలో జోరుగా ప్రచారం
హైదరాబాద్, (ADITYA9NEWS): వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు, స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య మధ్య జరిగిన రహస్య సమావేశాల వెనుక ఏమి జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. రాజయ్య, బ్రదర్ అనిల్ ఇప్పటికే 3 సార్లు రహస్యంగా చర్చించుకున్నారని ప్రచారం పెరిగింది. వీరిద్దరి మధ్య చర్చ రాజకీయ పరమైన వార్తలకు బలం చేకూర్చింది. షర్మిలకు తోడుగా ఉండే భర్త ప్రార్థనలకే పరిమితం కాకుండా, రాజకీయం వైపు దృష్టి మళ్లీంచారనేది ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్‌గా మారింది.
టీఆర్ఎస్ విజయం మోగించిన తొలి పాలనలో రాజయ్యకు పెద్ద పీట వేశారు. డిప్యూటీ సీఎంగా మంచి అవకాశం వచ్చింది. అయితే ఈసారి రెండవ దఫా పాలనలో రాజయ్యను పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. కేవలం ఆయన ఎమ్మెల్యే పదవికి మాత్రమే పరిమితమ్యారు. దీంతో రాజయ్యకు పార్టీపైనా, సీనియర్ నేతలపైనా సహజంగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజయ్య వైఎస్ అభిమాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల వెంట రాజయ్య నడుస్తారా అనేదానికి, ఈరహస్య సమావేశాలు జీవం పోశాయి.
బ్రదర్ అనిల్, రాజయ్య మద్య జరిగిన సంభాషణలు కేవలం మతపరమైనవా, లేక రాజకీయమా అనేది రాజయ్య తీసుకునే నిర్ణయాలే చెబుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా వైఎస్ షర్మిల తన తండ్రి హయాంలో ఉన్న పరిచయాలను, వైఎస్ఆర్ టీపీ కి అనుకూలంగా చేర్చుతున్నట్లు వినికిడి. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి పార్టీ గాలం వేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్, టీఆర్ ఎస్ లతోపాటు, కొంత మంది ఇతర పార్టీల అసంతృప్తి నాయకులు షర్మిల బాటలో అడుగులు వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ రాజకీయ పరిణామాలు ఏలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది.