రాజు గారి మాట ‘ రెడ్డి ’ గారికి తూటా..!

రాష్ట్రంలో వైసీపీకంటూ శత్రువులెవ‌రైనా ఉన్నారంటే అది వైసీపీ నాయకులే .
విచిత్ర‌మేమిటంటే సాధార‌ణంగా ఎక్క‌డైనా, ఏరాష్ట్రంలోనైనా అధికారపార్టీకి
ప్ర‌తిప‌క్షం శ‌త్రువుగా ఉండ‌టం స‌ర్వ‌సాధార‌ణం. కాని ఇక్క‌డ ఉన్న
టీడీపీ, జ‌న‌సేన‌లు ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను పేప‌ర్ల‌లో  మాత్ర‌మే
పోషిస్తున్నాయనంటే అతిశ‌యోక్తి కాదు. ఇటీవ‌ల అచ్చెన్నాయుడు అరెస్టు
త‌రువాత జ‌గ‌న్‌పై వీర దూకుడు చేస్తున్న‌ టీడీపీ నేత‌లు హ‌డావుడి
త‌ప్పితే పెద్ద పోరాట‌మేమి కాద‌నే చెప్పాలి.  ఇదిలా ఉంటే..వైసీపీలో
మాత్రం రోజు రోజుకి సొంత శ‌త్రువులు పెరిగిపోతుండ‌టం రాజ‌కీయాల్లో వేడి
పుట్టిస్తోంది.

ఒక్క మాట చెప్పాలంటే వైసీపీలో అంత‌ర్గ‌త‌ పోరు నివురు గ‌ప్పిన నిప్పులా
ఉంది.  ఇటీవ‌ల రాష్ట్రంలో కొంత మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్ పాల‌న తీరుపై
విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ
కృష్ణం రాజు తీవ్ర‌స్థాయిలో రెడ్డి పాల‌న‌పై వీడియో చేసి మ‌రీ తూటాలు
పేల్చారు.

 వైసీపీలో తనను బతిమిలాడి తీసుకొచ్చారని, ఎవరి దయా దాక్షిణ్యాల వ‌ల్ల
తాను నెగ్గలేదన్నారు.  ప్రజా సమస్యలు చెబుదామంటే ఇప్పుడు జగన్‌
అపాయింట్‌మెంటే దొరకడం లేదంటూ ఎంపీ రఘరామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో ఆయనలో
దాగి ఉన్న అసహనాన్ని ఒక్కసారిగా బయటపెట్టారు. రాష్ట్రంలో ఇసుక విధానం,
మద్యం పాల‌సీ, ఇతర ప్రజా సమస్యలను నేరుగా జగన్‌కు వివరిద్దామనుకుంటే,
జగన్‌ను క‌ల‌వ‌నీయ‌కుండా కోటరీ అడ్డుపడుతుందన్నారు.  పైగా తాను కరోనా
టైమ్‌లో ప్రజా సమస్యలు పట్టించుకోలేదని న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి
ప్రసాద్‌ రాజుతో తిట్టించి చిన్న కుల‌మైన తమ కులంలో చిచ్చు పెడుతున్నారని
తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రసాద్‌రాజుకు త్వరలో మంత్రి ఇస్తే
సంతోషించేవాడిని తానేనని, కాని తనను ఎంత ఎక్కువగా తిడితే అంత త్వరగా
మంత్రి పదవి ఇస్తారో అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉందన్నారు.
ప్ర‌జాప్ర‌తినిధులు స‌భ‌లు, స‌మావేశాలు పెట్టొద్ద‌ని కోర్టులు చెబుతుంటే,
కోర్టుల మీద గౌర‌వం ఉన్న వ్య‌క్తిగా కోవిడ్‌-19 స‌మ‌యంలో బ‌య‌ట‌కు
రాకుండా ఫోన్ ద్వారా స్నేహితుల స‌హ‌కారంతో ప్ర‌జ‌ల‌కు సాయం
అందించానన్నారు.

కేవలం వైసీపీలో రెడ్డి కుల‌స్తుల‌కే న్యాయం జరుగుతుందని ఎంపీ రఘరామ
కృష్ణంరాజు చేసిన వాక్య‌లు ప్ర‌కంప‌నలు సృష్టిస్తున్నాయి. పార్లమెంట్‌లో
ఉన్న క‌మిటీల్లో వైసీపీ వ‌చ్చిన ఒక్క ప‌ద‌విని ఏ రెడ్డికి క‌ట్ట‌పెట్టారో
అంద‌రికి తెలిసిందేన‌ని, ప‌రోక్షంగా  విజయసాయిరెడ్డిని ఉద్ధేశించి
మాట్లాడారు. పార్ల‌మెంట్‌లో త‌న‌కు కూడా ప‌ద‌వి వ‌చ్చింద‌ని కాని అది
జ‌గ‌న్ వ‌ల్ల మాత్రం కాద‌ని ఎమ్మెల్యే ప్ర‌సాద్‌రాజు తెలుసుకుంటే
మంచిద‌న్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పదవుల్లో చిట్టా
విప్పితే కేవలం రెడ్డి ప్రాధాన్యతే కనిపిస్తోందన్నారు. పవన్ ఏమైనా తిడితే
కాపు నాయ‌కుల చేత తిట్టించడం, బీసీలు ప్ర‌శ్నిస్తే పార్టీలో బీసీ నేత‌ల
చేత తిట్టించ‌డం విచిత్ర‌మైన సిద్ధాంతం వైసీపీలో మాత్ర‌మే ఉంద‌న్నారు.
ఇప్పుడు త‌న ప్రియ మిత్రుడైన న‌ర‌సాపురం ఎమ్మెల్యే ప్ర‌సాద్ రాజుతో
తిట్టించడం కూడా బ‌హుశ ఇందులో భాగ‌మై ఉంటుంద‌న్నారు.

వాస్త‌వానికి  వైెసీపీలో రెడ్డి కులానికి మెజార్టీ వాట ఉన్నప్పటికీ  అదే
పార్టీకి చెందిన ఎంపీ ర‌ఘు రామ‌కృష్ణంరాజు బహిరంగంగా వైసీపీలో రెడ్డి
పాత్రను బయటపెట్టడం పార్టీలో కుల పోరుకు దారి తీసింది. ఇప్పటికే జగన్‌
ఇసుక విధానం, మద్యం పాల‌సీల్లో పార్టీ ఎమ్మెల్యేకు అర్థం కాకుండా
పాలిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో సొంత పార్టీ నేతల‌
నుండి వస్తున్న విమర్శల‌ను ఏలా కట్టడి చేస్తారో లేక  ఇంకా చిచ్చు
రేపుకుంటార‌నేది  ఎంత త్వ‌ర‌గా మేల్కొంటే వైసీపీ  నేతలకు అంత మంచిది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్