టాప్ లో తూర్పు గోదావరి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేరోజు పెద్ద ఎత్తున కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. శనివారం( 18 ) ఉదయం 9 గంటల నుంచి ఆదివారం (19 )ఉదయం 9 మధ్య 5,041 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దాని బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 56 మంది మృతి చెందారు. 24 గంటల్లో పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 16.18 శాతం పాజిటివ్‌గా తేలాయి. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 49,650కు, మృతుల సంఖ్య 642కు చేరాయి. పశ్చిమగోదావరి, నెల్లూరు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మరణాలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది మంది, శ్రీకాకుళంలో ఎనిమిది మంది, కర్నూలు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఏడుగురేసి, ప్రకాశంలో నలుగురు, అనంతపురం, కడప, విజయనగరం జిల్లాల్లో ముగ్గురేసి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో చెరో ఇద్దరు చొప్పున 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ కర్నూలు జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 100 దాటగా.. ఇప్పుడా జాబితాలో కృష్ణా చేరింది.
* అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 647 మంది, అనంతపురంలో 637, శ్రీకాకుళంలో 535, చిత్తూరులో 440 మందికి కరోనా సోకింది.
* 24 గంటల వ్యవధిలో 31,148 నమూనాలు పరీక్షించారు. 1,106 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.
* ఇప్పటివరకూ చేసిన పరీక్షల సంఖ్య 13,15,532కు చేరింది.
* కేసుల సంఖ్య తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలో 6 వేలు దాటేసింది. అనంతపురం జిల్లాలో 5 వేల మార్కు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో 2 వేల మార్కు దాటాయి.
* ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారి సంఖ్య రెండు రోజులుగా లేదు.
