ఏపీ హోం మంత్రి సుచరిత రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధారమని ఏపీ హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ విషయంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. వైకాపా ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆదరణ పెరగకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పారు.
‘‘ఈ ప్రభుత్వానికి ఫోన్లు ట్యాపింగ్ చేసే అవసరం లేదు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేస్తారు. మీరు ఏమైనా సంఘ విద్రోహ కార్యకలాపాలు చేస్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీ మనీ లాండరింగ్ వ్యవహారం బయటకు వస్తుందని భయపడుతున్నారా? దేశంలోనే జగన్ మూడో అత్యుత్తమ సీఎం అని పేరు తెచ్చుకోవడం చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’’ అని సుచరిత అన్నారు.