హైదరాబాద్(ADITYA9NEWS): లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల సొమ్మును కేమన్ ఐలండ్స్‌లో దాచిన విషయం తాజాగా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) బయటపెట్టింది. కరేబియన్ సముంద్రంలో కేమన్ దీవుల్లో డొల్ల కంపెనీలు సృష్టించి పెట్టుబడుల కింద బాధితుల నగదును మళ్లించిన అగ్రిగోల్డ్ మానీ లాండరింగ్‌కు పాల్పడిందని తేల్చింది. ఇప్పటికే ఈకేసును ఏపీ సిఐడి దర్యాప్తు చేయగా, తాజాగా ఈడీ కేమన్ దీవులకు నగదు బదలాయించిన విషయాన్ని కోర్టుకు నివేదించింది. నిందితులైన అగ్రిగోల్డ్ సంస్థ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరక్టర్లు వెంకట శేషు నారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌లను అరెస్టు చేసి హైదరాబాద్ లో ఈడీ పీఎమ్ ఎల్ ఏ కోర్టులో హాజరుపరచడంతో , కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ కేసు దర్యాప్తునకు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కూడా ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. వివిధ ఆకర్షణీయమైన పథకాలను ఆశ చూపిన అగ్రిగోల్డ్ సంస్థ, 32 లక్షల మంది నుండి రూ.6,380 కోట్ల సొమ్మును, డిపాజిట్లు రుపేణా సేకరించి పక్కదారి పట్టించిన విషయం పాఠకులకు విధితమే.
