అమరావతి, (ADITYA9NEWS): అవును, మీరు వింటున్నది నిజమే, ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం అనేది కేవలం మాటలకే పరిమితం అవుతోంది. కేసుల వ్యాప్తి ఇటీవల మరలా క్రమేపి పెరగడంతో వైద్య వర్గాల్లో ఆందోళన మొదలైంది. కొవిడ్ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తిలో మూడో దశ ఉండొచ్చన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఆసుపత్రుల్లో చేరికల పెరుగుదల వైద్య వర్గాలను కలవరపెడుతోంది.
కరోనా కేసులు తగ్గుతున్నాయన్న నివేదికలతో ప్రభుత్వం ఇటీవలే కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇచ్చింది. అదే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్న నిబంధనలు పెట్టింది. ప్రజలెవ్వరూ వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారం తిరుగుతుండటం ఇప్పుడు కోవిడ్ థర్డ్ వేవ్‌కు మార్గం సుగమం చేసినట్లయ్యిందని వైద్యులు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే జరిగే పరిణామాలు ఉహించలేమన్నది వారి వాదన. ఒకపక్క ముఖ్య కూడళ్లలో రద్దీ పెరుగుతోంది. చాలామంది మాస్కులు కూడా ధరించడం లేదు, సామాజిక దూరం ఉండానే మాటనే మరచిపోయారు. దీనివల్ల ఆసుపత్రుల్లో చేరేవారు, డిశ్ఛార్జి అయ్యేవారి సంఖ్యలో వ్యత్యాసం క్రమంగా తగ్గడం తాజాగా తెరపైకి వచ్చింది.