- షెడ్యూల్ విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు
కాకినాడ, (ADITYA9NEWS) : తూర్పుగోదావరి జిల్లాలో గత ఏప్రిల్ నెలలో నూతనంగా ఎన్నిక కాబడిన గ్రామ సర్పంచులకు ఈ నెల 22 నుంచి 12 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్తు సీఈవో ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జూలై 22 (గురువారం) ఉదయం 9:30 గంటలకు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి ప్రారంభించడం జరుగుతుందన్నారు. తొలి రోజుల శిక్షణ కార్యక్రమానికి కాకినాడ డివిజన్ లో ఉన్న గ్రామ సర్పంచులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.
రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం , కాకినాడ, రంపచోడవరం ప్రాంతంలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలలో సర్పంచులకు శిక్షణ ఉంటుందన్నారు. అయితే 5 వేలు జనాభా దాటిన 218 సర్పంచులకు మాత్రం సామర్లకోట ఈటీసీ కేంద్రం నందు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. మూడు రోజులపాటు సర్పంచులకు ఉచిత భోజనం, ఇతర అన్ని వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ సర్పంచ్ యొక్క విధులు- బాధ్యతలు, వివిధ సంక్షేమ కార్యక్రమాల పై అవగాహన , త్రాగునీరు,గ్రామీణ రోడ్ల నిర్మాణం , తదితర అంశాలపై అవగాహన తోపాటు తమ గ్రామాలను ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దుకునేందుకు ఇది ఒక చక్కటి అవకాశం అని, సర్పంచులు విధిగా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జేడ్పీ సీఈవో కోరారు.