ప్రైవేటు ఎలక్ట్రీషియన్ స్తంభంపైనే షాక్‌కు గురై మృతి
ఆదిలాబాద్ ఓ ఇంటికి విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో మరమ్మతులు చేసేందుకు కరెంట్ స్తంభం ఎక్కిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్.. స్తంభంపైనే షాక్‌కు గురై మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా రాములుగూడలో ఈ ఘటన జరిగింది.
ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రాములుగూడ గ్రామానికి చెందిన దడంజే మోతీరాం (35) కొన్నేళ్లుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఓ ఇంటికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మోతీరాంను పిలిచారు. ఆయన వచ్చి సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు.
అయితే పైనుంచి వెళ్తున్న త్రీఫేజ్ విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కుగురై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మోతీరాం మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. తమకు పరిహారం చెల్లించే వరకు మృతదేహాన్ని కిందకు దించొద్దని డిమాండ్ చేశారు.
విద్యుత్ అధికారులు అక్కడికి రావడం ఆలస్యం కావడంతో మోతీరాం మృతదేహం స్తంభంపైనే నాలుగు గంటలపాటు ఉండిపోయింది. పోలీసులు, విద్యుత్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.