వైజాగ్ ను సందర్శించిన ఆర్థిక మంత్రి
స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ అడుగడుగునా నినాదాలు
విశాఖ, (ADITYA9NEWS): వైజాగ్ స్టీల్ ప్లాంట్ (VSP) ను ప్రైవేటీకరించాలనే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న సమయంలో , కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (శుక్రవారం) వైజాగ్ సందర్శించారు. ఉత్తర ఆంధ్రా జిల్లాల్లో 3రోజుల పర్యటనలో భాగంగా నిర్మల ఈరోజు వైజాగ్ చేరుకున్నారు. VSP ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ వందలాది మంది VSP ఉద్యోగులు వైజాగ్ విమానాశ్రయానికి చేరుకుని కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ నిర్మలా సీతారామన్‌కు వ్యతిరేఖతను తెలిపారు.
ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీసు బలగాలు వైజాగ్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. వైజాగ్ విమానాశ్రయ ప్రాంగణంలోకి కార్యకర్తలు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదానికి దారితీసింది.పోలీసు వలయాన్ని ఉల్లంఘించి వైజాగ్ విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 150 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ లకు వ్యతిరేకంగా నిరసననకారులు నినాదాలు చేశారు. నిర్మలా సీతారామన్ ఎక్కడ పర్యటించినా అడ్డుకోవాలని కార్యకర్తలు ఉత్తర ఆంధ్రా జిల్లాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు మరియు ప్రజలకు పిలుపునిచ్చారు.