దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ సీఎంపై ఆరోపణలు
రాజమహేంద్రవరం, (ADITYA9NEWS) : ప్రభుత్వం పేదలకు సేకరించిన ఇళ్ల స్థలాల విషయంలో చాలా తప్పులు జరిగాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. రాజమండ్రిలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పలు వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడి ఆవ భూములకు ఇద్దరే యజమానులని చూపించి, ఎందుకు పనికి రాని భూములను ఎకరం రూ.45 లక్షలకు కొనుగోలు చేయడం దారుణమన్నారు.
వాస్తవానికి రూ.7 లక్షలు విలువ చేసే భూములకు ఈ తరహాలో లక్షలు దాటించి సొమ్ములు దారాదత్తం చేశారన్నారు. గొందిలో కూడా అదే విధంగా జరిగిందన్నారు. ఇలాంటి భూముల పై హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించాలన్నారు. గతంలో ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డిలు వేల ఎకరాల భూమి దళితులకు ఇచ్చారన్నారు. కాని అలాంటి దళితులకు ఇచ్చిన భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందని, ఇందులో దళితులకు ఎటువంటి పరిహారం అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ఈవిధానాలన్ని దళితులకు వ్యతిరేఖంగా ఉన్నాయని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.