*నెగిటివ్ వచ్చినా వదలని మహమ్మారి..
*రెండు వ్యాక్సిన్లు వేసుకున్నా వీడని మృత్యువు.
కాకినాడ,(ADITYA9NEWS): కోవిడ్ వచ్చిన తరువాత ఎంత జాగ్రత్తగా ఉన్నా, అది మన చేతుల్లో ఉండదనేది కొన్ని సంఘటనలు చూస్తే స్పష్టమవుతోంది. కరోనా తగ్గినా ఒక్కొసారి అది హఠాత్తుగా ప్రాణాలనే తీసుకుపోతుంది. అలాంటి ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడరూరల్లో జరిగింది. పోలీసుశాఖలో పనిచేసిన ఒక రిటైర్డ్ ASI ప్రాణాలను హరించింది.
వివరాల్లోకి వెళితే..
కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడులో ఉంటున్న ఆవాల అప్పలరాజు అనే విశ్రాంత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కు కొద్ది రోజుల క్రితం కరోనా వచ్చింది. ఆయన కాకినాడరూరల్ వాకలపూడిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ వచ్చింది. ఇంకా రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తారు అనగా, ఒక్కసారిగా ఊపీరితత్తులపై ఒత్తిడి పెరిగింది. ఇంకే ముంది ఏమర్జన్సీగా కాకినాడ పట్టణంలోని నాగమల్లి జంక్షన్ వద్ద ఉన్న పెద్ద ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఇలా చేర్చిన కొన్ని గంటల్లోనే ఆయన మృత్యువాత పడ్డాడు.
ఇంటికి వచ్చేస్తాడునుకున్న వ్యక్తి కళ్లముందే కనుమరుగయ్యాడు. కరోనా తగ్గినా పోస్ట్ కోవిడ్ ఎంత పెను ముప్పుగా మారుతుందనే దానికి ASI మృతి ఉదాహరణ. అప్పలరాజు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, పిఠాపురం రూరల్, కాకినాడ త్రిటౌన్, తొండంగి, రాజవొమ్మంగి తదితర ప్రాంతాల్లో పనిచేసి సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
జనవరి,2020లో రిటైర్ అయిన అప్పలరాజు విశ్రాంత జీవితంతో ఇంటిలో ఆనందంగా ఉండేవారు. రిటైర్డ్ అయినా కూడా, నిత్యం వ్యాయామం, ఆహారపు నియమాలు అన్ని పోలీస్ ట్రైనింగ్ తరహాలోనే ఉండేవి. కరోనా ప్రభావం అని తెలిసిన తరువాత చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తిగా రెండు వ్యాక్సిన్లు కూడా వేయించుకున్నారు. కాని అనూహ్యంగా ఆయన ఇటీవలే కోవిడ్ భారీన పడ్డారు. చివరకు కరోనా తగ్గినా పోస్ట్ కోవిడ్ ప్రభావం ఎక్కువ ఉండటంతో మృత్యువుతో పోరాడి ఓడారు.