
వారు సైతం సమస్యలతో స్వాగతం
పిఠాపురం, (ADITY9NEWS) : రాజకీయ చైతన్యానికి పిఠాపురం పెట్టింది పేరు. ఇక్కడ వాతావరణమో, లేక, చైతన్య పథమో తెలియదుకాని కుండబద్దలు కొట్టినట్టు మాట్లడటం మాత్రం పిఠాపురం నేతలకు అలవాటుగా మారిపోయింది. తాజాగా ఏర్పడ్డ కౌన్సిల్‌లో 20 మంది వైసీపీ, ఆరుగురు టీడీపీ, నలుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. తొలి కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన టీడీపీ కాసింత ఒపికగా ఉంటే , అధికార పక్షం కౌన్సిలర్లు మాత్రం సమస్య చిట్టా విప్పారు. దీంతో ఎవరు ప్రతిపక్షమో, ఎవరు అధికార పక్షమో అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది.
కౌన్సిల్‌కు తీసుకొచ్చిన సమస్యల చిట్టా చూస్తే ప్రతీ వార్డులో సభ్యుడు ఒక ప్రతిపక్షంగా వ్యవహరించారంటే ఆశ్చర్యపోనక్కర్లేద్దనేలా సమావేశం జరిగింది. పిఠాపురం ఛైర్‌పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన శనివారం(27న) జరిగిన తొలి సమావేం ఆసక్తికరంగా సాగింది.
కేవలం 3 అంశాల అజెండాతో సింపుల్‌గా ముగించేద్దామనుకుంటే పరిచయ కార్యక్రమంతో మొదలైన సమావేశం ప్రతీ వార్డులో సమస్యల కుప్పను కమిషనర్, మున్సిపల్ సిబ్బంది నెత్తిన పెట్టారు కొత్త కౌన్సిలర్లు. శానిటేషన్ , తాగునీరు దగ్గర నుండి వీధి దీపాల నిర్వాహణ, వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. దీంతో కొత్త ఛైర్‌పర్సన్ సూర్యావతి సైతం ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఏదేమైనా తొలి సమావేశంలోనే అసమ్మతి రాగాలు కొంత కొంతగా బయటకు రావడంతో అధికారపక్షంలో లుకలుకలున్నాయానే అనుమానాలకు బలం చేకూర్చింది. మొత్తం మీద వార్డు సమస్యలు తీరిస్తే కొత్త కౌన్సిలర్ల ఆవేశానికి అడ్డుకట్ట పడుతుందనే అవకాశాన్ని, కొత్తగా పగ్గాలు చేపట్టిన ఛైరపర్సన్ వర్గంఏవిధంగా ముందుకు తీసుకెళ్తుందనేది వేచి చూడాలి.