తిరుపతి సభకు రాలేనన్న ముఖ్యమంత్రి..బహిరంగ లేఖ
అమరావతి(ADITYA9NEWS) :
ఒక పక్క తెలుగుదేశం, మరోపక్క బీజేపీ, జనసేన కలిపి తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికకు కుస్తీ పడుతున్నాయి. చంద్రబాబు, లోకేష్ హోరా హోరీ ప్రచారం. మొత్తం రాష్ట్రంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు తిరుపతి ఎన్నికల కోసం ముమ్మర ప్రచారం. బీజేపీ సీనియర్ నాయకులు ప్రచార జోరు ఇది తిరుపతి పోరులో కనిపిస్తున్న తీరు.
వైసీపీ సీనియర్ నేతల ప్రచార జోరు పక్కన పెడితే, ఈనెల 14న ముఖ్యమంత్రి జగన్ రాకతో ఊపేదామనుకున్న కేడర్‌కు జగన్ సడన్ బ్రేకులు వేశారు. కోవిడ్ పెరుగుతున్నందున రాలేకపోతున్నానని ప్రజల ఆరోగ్యమే ముఖ్యమంటూ జగన్ రాసిన లేఖతో వైసీపీ నాయకులకు మతి తప్పినంత పనైంది. తిరుపతి ఎంపీ సీటు తమదేనన్న నమ్మకమా.. లేక అమరావతి నుండే జ*గన్* పేలుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
యావత్తు రాష్ట్రం ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల వైపే చూస్తోంది. మొన్నటి వరకూ మున్సి*పల్టీ*లు కొట్టిన టీడీపీ , ఏకంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పూర్తిగా దూరమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు దిగబోమని చెప్పిన చంద్రబాబు, తిరుపతి ఎంపీ సీటుపై మాత్రం కన్నేశారు. ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల కాబట్టి అక్రమాలకు తావులేకుండా ఉంటుందని బాబు ఆశో, లేక తిరుపతిలో టీడీపీకి దన్నుందని చూపించడానికి మొత్తం మీద తిరుపతి గెలుపు పై టీడీపీ తమ్ముళ్లు కొండంత ధీమాతో ఉన్నారు. అదే స్థాయిలో లోకేష్, కేడర్ విస్తృత ప్రచారానికి తెరలేపారు. రోజు ఏ పత్రిక చూసినా తిరుపతి ఉప ఎన్నిక గెలుపు కోసం జగన్‌ను తిట్టని రోజులేదు. దీంతో వైసీపీ కూడా జగన్ సభతో టీడీపీని ఉతికారేయించాలని భావించారు.
కాని, అనూహ్యంగా జగన్ సభకు రాలేనని చెప్పడం వైసీపీ నేతలను అయోమయానికి గురి చేసింది. జగన్ రాకుండానే ఎన్నికలలో తిరుపతి ఎంపీ స్థానం దక్కించుకుంటే నిజంగా వైసీపీకి తిరుగులేదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపడమా.. లేక సీనియర్‌లు సత్తా చూద్దామని జగనే ఆగిపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోవిడ్ వల్ల తిరుపతి రాలేకపోతున్నా అని చెప్పిన జగన్ మాట పక్కన పెడితే, జగన్ రాకుండా తిరుపతి ఉప ఎన్నిక నెగ్గితే మాత్రం చంద్రబాబు అండ్ కోకు పగలు చుక్కలు కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.