* జీతాలిచ్చి మా ఆకలి తీర్చండి
* తూ.గో.జిల్లాలో కోవిడ్ విభాగ వైద్యులు, నర్సులు ఆందోళన
కాకినాడ , (ADITYA9NEWS): ఎవరూ చేయని సాహసం చేస్తున్నాం..మా ప్రాణాలను పణంగా పెట్టాం. మీరు చెప్పింది చేస్తున్నాం. కోవిడ్ రోగులకు నిత్యం సేవ చేస్తున్నాం. కాని ఇన్ని చేస్తున్నా కనీసం మీరు మా పొట్ట నింపేందుకు మాత్రం ముందుకు రావడం లేదంటూ కోవిడ్ సేవలందిస్తున్న వైద్యులు రోడ్డెక్కారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సామాన్య ఆసుపత్రిలో కోవిడ్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులకు గాని, నర్సులకు, సిబ్బందికి గాని గత నాలుగు నెలలుగా జీతాలు లేవు. కోవిడ్ ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్న వీరంతా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చి కాకినాడ జిజిహెచ్ లో సేవలందిస్తున్నారు. గతంలో వీరంతా కోవిడ్ వచ్చిన కొత్తలోనూ పని చేశారు. ఆ జీతాలు పూర్తిగా చెల్లించకుండానే కోవిడ్ తొలి దశ తగ్గుముఖం పట్టడంతో వీరి సేవలను అర్థాంతరంగా నిలిపివేసింది ప్రభుత్వం.
మరలా ఏప్రిల్ నెల నుండి వచ్చిన రెండో దశ కరోనా ఎఫెక్ట్‌తో వీరి సేవలు మరలా అవసరం కావడంతో విధుల్లోకి చేరాలని ఆఫర్ ఇచ్చింది. గతంలో ఇవ్వాల్సిన జీతంతో పాటు, రెండో దశ జీతాలు ఇచ్చేస్తారనడంతో వైద్యులు, సిబ్బంది కోవిడ్ కేర్‌లో పనిచేస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్‌లో వికాస ద్వారా వీరంతా కలెక్టర్ ఇచ్చిన అపాయింట్‌మెంట్‌తో గత నాలుగు నెలులగా విధులు నిర్వర్తిస్తున్నారు. తొలి దశ కోవిడ్ కాలంలో ఇంకా చెల్లించాల్సిన జీతం మాట పక్కన పెడితే , ప్రస్తుతం పనిచేస్తున్న దానికి చిల్లి గవ్వ ఇవ్వలేదు. కనీసం ప్రయాణ ఖర్చులు కూడా లేకపోవడంతో చాలా మంది వైద్య సిబ్బంది అప్పులు జేసి గడుపుతున్నారు. తమ జీతం ఇప్పించాలని తాజాగా జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ లక్ష్మీశాను కలిసి వేడుకున్నారు.