కన్నాకు మళ్లీ ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ..పార్టీలో ప్రచారం
అమరావతి, (): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారా..అంటే, బీజేపీ శ్రేణుల్లో అది నిజమే అని ప్రచారం పెరిగింది. ఇందుకు గల కారణాలు ఆరాతీస్తే, అసలు సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా లాభం లేదని పెద్దలు తేల్చినట్టు సమాచారం. పైగా వైసీపీకి అనుకూలంగా ఉంటున్నట్టుగా సోముపై ఆరోపణలున్నాయి.
దీనిపై ఇప్పటికే గురిపెట్టిన పెద్దలు, ఎప్పుడు సోమును తప్పించాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పక్క వైసీపీ ప్రభుత్వం విధానాలు బీజేపీకీ వ్యతిరేఖంగా మారుతున్న తరుణంలో, కనీసం వైసీపీపై ఇక్కడ ఏ ఒక్క నేత ప్రశ్నించిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో ఆంధ్రాలో బీజేపీ బలం పుంజుకోవాలంటే స్వతంత్రంగా ఎదగాలి. ఇలాంటి పరిస్థితుల్లో గట్టిగా మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశే నేత అవసరం ఉంది. అందుకే అధిష్టానం సోమును తప్పించి, కన్నా లక్ష్మీనారాయణకే అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా అమరావతి రైతుల విషయంలో సోముతో పోలిస్తే కన్నాకే ఎక్కువ మార్కులు పడ్డాయి. పోరాటంలో రైతులకు పూర్తి మద్ధతిచ్చిన కన్నా, అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామి ఇచ్చారు. సోము ఆ సహాసం చేయలేదు. ఇప్పుడిలాంటి అంశాలన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుని సోమును పక్కన పెట్టడానికి నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. ఈ నిర్ణయం ఎంత వరకూ అమలవుతుందనేది మాత్రం వేచి చూడాలి.