ఐసీఎల్ సిమెంటు కర్మాగారం విశ్రాంత కార్మికుడు బొలిశెట్టి వెంకటరమణయ్య (60)ను కిరాతకంగా హత్య చేసి తల ఒక చోట పడేసి, మొండెంను ఇంటి మరుగుదొడ్డి సమీపంలో పాతిపెట్టారు. ఈ క్రూర ఘటన కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో వెలుగులోకి వచ్చింది. ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరమణయ్య తన భార్య శ్యామలాదేవితో కలిసి ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని మహాత్మానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు రాకేష్, కుమార్తె శ్రుతి ఉన్నారు. ఆయన ఐసీఎల్ సిమెంట్ పరిశ్రమలో పనిచేసి పదవీవిరమణ పొందారు. ఆ సమయంలో వచ్చిన నగదు, మరికొంత కలిపి వడ్డీకి అప్పులు ఇచ్చారు. ఎర్రగుంట్ల నగర పంచాయతీ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్యకు ఇచ్చిన మొత్తం, వడ్డీ కలిపి సుమారు రూ.30 లక్షల వరకు అయింది. ఈ డబ్బు తిరిగివ్వాలని పలుమార్లు అడిగారు. దీంతో ఆయన రమణయ్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ నెల 20 మహాత్మానగర్‌లోనే ఖాళీగా ఉన్న తన ఇంటికి రమ్మని కబురు పంపాడు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న ముసలయ్య, మరికొంతమంది కిరాయి వ్యక్తుల సాయంతో వెంకటరమణయ్యను హతమార్చారు. తల వేరు చేసి..మొండాన్ని ఆ ఇంటి ప్రాంగణంలోని మరుగుదొడ్డి సమీపంలో పాతిపెట్టారు. తలను ఓ స్టీల్ డబ్బాలో ఉంచి తన బంధువుల సహాయంతో మరుసటి రోజు ఉదయం సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని గువ్వల చెరువు ఘాట్ వద్దకు తీసుకెళ్లి ముసలయ్య అడవిలోకి విసిరేశారు. రెండు రోజులుగా వెంకటరమణయ్య కనిపించకపోవడంతో ఆయన తమ్ముడు రామయ్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్‌కాల్స్ విశ్లేషించి ముసలయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. వెంకటరమణయ్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. పాతిపెట్టిన మొండెంను వెలికితీశారు. ఈ ఘటనలో పై పోలీసులు విచారణ చేపట్టారు.
