కనిపించని ప్రతీయేటా డీఎస్సీ
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగడుగునా అడ్డంకులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హేతుబద్దీకరణ అమలైతే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30వేల టీచర్ పోస్టులు సర్దుబాటు అవుతాయి. దీంతో ఆ పోస్టుల ఖాళీలు కనిపించవు. ప్రాథమిక పాఠశాలల్లో 15 వేలు, ఉన్నత పాఠశాలల్లో 12 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండు నుంచి మూడు వేల వరకు పోస్టులు రద్దవుతాయని అంచనా వేస్తున్నారు. ఇలా జరిగితే భవిష్యత్తులో డీఎస్సీ నోటిఫికేషన్లు ప్రశ్నార్థకంగా మారొచ్చనేది ఉపాధ్యాయ సంఘాలు చెబతున్నాయి.
పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థుల చేరికను బట్టి హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది. 2020 ఫిబ్రవరిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికనే రేషనలైజేషన్‌పై ముందుకెళ్లాలని ప్రతిపాదించడం గమనించదగ్గ విషయం. విద్యాహక్కు చట్టం ప్రకారం 1:30 నిష్పత్తిలో టీచర్-విద్యార్థులు ఉండేలా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని చెబుతున్నారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం అంటున్న ప్రభుత్వం, ప్రాథమిక పాఠశాలల్లో ఇకపై సింగిల్ టీచర్‌లు ఉండరని, కనీసం ఇద్దరు టీచర్లు ఉంటారని చెబుతోంది.అయితే హేతుబద్ధీకరణ కార్యాచరణ అమలైతే పోస్టులు గల్లంతవుతాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పుడు 20లోపు విద్యార్థులు ఉంటే సింగిల్ టీచర్, 40 వరకు ఉంటే రెండో పోస్టు, 60 వరకు మూడో పోస్టు, 80 వరకు నాలుగో పోస్టు, 100 వరకు ఐదో పోస్టు, 120 వరకు ఆరో పోస్టు + ఎల్‌ఎ్‌ఫఎల్ హెచ్ ఎమ్ పోస్టును కేటాయిస్తున్నారు. విద్యా సంవత్సరంలో పిల్లల చేరికను బట్టి ఉపాధ్యాయ పోస్టుల పెంపు జరగాలనే వాదన బలంగా ఉంది.
హైస్కూల్స్‌లో 240 మంది విద్యార్థులకు 9 పోస్టులను నిర్ధారించారు. 240 మందికి మించి విద్యార్థులు ఉంటే మరో సెక్షన్ ఇస్తున్నారు. తాజాగా 320 మందికి మించితేనే రెండో సెక్షన్ ఇస్తామని ప్రతిపాదించడంతో పోస్టుల సంఖ్యను కుదించినట్లవుతోంది. ఇలాంటి నిబంధనలతో ఉపాధ్యాయ పోస్టులకు కోత పెట్టొద్దని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నారు.