యాజమాన్యాల చేతిలోకే పరిష్కార *కీ*
ఎటూ తేలని ఎయిడెడ్ ఉపాధ్యాయుల భవిత్యం
ఆరు నెలలు సాహావాసం చేస్తే వారు వీరయ్యారన్నట్టుగా ఉంది ఎయిడెడ్
ఉపాధ్యాయులపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. ఒక పక్క రాష్ట్రంలో
ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు అతీ గతీ లేకుండా ఉన్నారు. గత ప్రభుత్వం
ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై మినిమేషాలు లెక్కించి వారి భవిష్యత్తును ఎటూ
తేల్చలేకపోయింది. పోని ప్రభుత్వం మారింది కదా బతుకులే
మారిపోతాయనుకుంటే మళ్ళీ పాత పాటే తప్పితే, కొత్త విధానాలకు
పూనుకోకపోవడం ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా 5 మంది సభ్యుల కమిటీని నియమించి ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితిపై
నివేదిక కోరిన ప్రభుత్వం విలీనంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో
ఎయిడెడ్ పాఠశాలలన్ని ప్రభుత్వంలోకి విలీనమైతే వేల మంది ఉపాధ్యాయుకు
మనశ్శాంతి దక్కుతుందని ఆశపడ్డ ఎయిడెడ్ ఉపాధ్యాయులందరికి నిరాశ
ఎదురైంది. స్వచ్ఛంధంగా యాజమాన్యాలు ఎయిడెడ్ పాఠశాలలను
ప్రభుత్వానికి అప్పగిస్తేనే విలీనం జరగొచ్చనే సంకేతాలు మాత్రమే
తెరపైకి వచ్చాయి. దీనిని బట్టి చూస్తే
ఈ కమిటీ కేవలం కాలయాపనకేనా అనే అనుమానాలకు తావిస్తోంది. కమిటీ
మాటలు చూస్తే ఎయిడెడ్ యాజమాన్యాల చేతిలోకే మళ్లీ ఎయిడెడ్ ఉపాధ్యాయుల
భవిత్యం వెళ్లిందని ఉపాధ్యాయల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇదీ కథ..
రాష్ట్ర సుమారు 10 వేలకు పైగా ఉపాధ్యాయులు ఎయిడెడ్
పాఠశాలల్లో పని చేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాల చేతుల్లో
వీరంతా కీలు బొమ్మలయ్యారు. ప్రభుత్వ నిబంధనలు ఇక్కడ అమలు కావడం లేదు.
దీంతో సర్వీసు ప్రకారం రావాల్సిన ప్రమోషన్లు ఇవ్వడం లేదు.
విద్యార్థులు లేకపోయినా లక్షల రూపాయాల జీతాల చ్లెంపులు తప్పడం లేదు.
వీటితోపాటు ఎయిడెడ్ మెయింటినెన్స్ గ్రాంటు కింద లక్షల రూపాయాలను
బడ్జెట్ రూపంలో ప్రభుత్వం యాజమన్యాలకు ఇవ్వక తప్పడం లేదు. ఈ
ఎయిడెడ్ సమస్యలన్ని ఏన్నో ఏళ్లుగా ప్రభుత్వాని మోయలేని భారంగా
ఉన్నాయి. కొన్ని యాజమాన్యాలైతే సొంత ఇంట్లో వారికి , బంధువులను
ఉపాధ్యాయులుగా రిక్రూట్ చేసుకున్నారు.
యాజమన్యాలకు ఉన్న హక్కుల ప్రకారం ఇలా చేసినప్పటికీ, ఆతరువాత
కాలంలో విద్యార్థుల సంఖ్యకు తగ్గ ఉపాధ్యాయులు లేకపోతే వేరోక పాఠశాల
నుండి రేషన్‌లైజేషన్ ద్వారా నియామకం చేస్తామని ప్రభుత్వం చెబితే
అందుకు మాత్రం యాజమాన్యాలు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఈ ప్రభావంతోనే
వేలాది ఖాళీలు భర్తీకాకుండా ఉండిపోతున్నాయి.
ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాలకు గత ప్రభుత్వానికి అండర్ వార్
జరిగింది. ఉపాధ్యాయుల భర్తీకి అనుమతి ఇవ్వాని అడిగిన యాజమన్యాలకు
ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ కాలం సాగించింది. ఎట్టకేలకు పోస్టుల
భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకేముంది ఎయిడెడ్ పాఠశాలలు
నిర్వహిస్తున్న కొన్ని యాజమాన్యాలు పోస్టుల అమ్మకాలు మొదలు పెట్టడంతో
దుమారం రేగింది. యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరుపై పత్రికల్లో కథనాలు
రావడం, ఆరోపణలు ఎక్కువ కావడంతో పోస్టు భర్తీకి నిబంధనల చిట్టా
తగిలించింది నాటి ప్రభుత్వం.
డీఎస్సీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, సిబ్బంది రిక్రూట్‌మెంట్ జరగాలని షరతులు
విధించింది. దీంతో అప్పటికే డబ్బు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు
ఎదుర్కొంటున్న కొన్ని యాజమన్యాలు ప్రభుత్వ విధానం సరికాదంటూ
కోర్టుకెక్కాయి. ఆ ఎపిసోడ్ అలా కొనసాగుతూనే ఉంది.
ప్రమోషన్లు గల్లంతే..
ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకున్న వారు ఈ ఎయిడెడ్‌లో కూరుకుపోతున్నారు.
ఎక్కువ సర్వీసు ఉండి కూడా పదోన్నతులు పొందలేకపోతున్నారు. అదే
సర్వీసు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రమోషన్లతో
దూసుకుపోతున్నారు. కాని ఎయిడెడ్‌లో మాత్రం ఉపాధ్యాయులు డెడ్ స్టోరేజి
స్థితిని ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల యాజమాన్యాలు పదోన్నతులపై
వీరితో ఆటలాడుకుంటున్నాయి. దీంతో మానసికంగా కూడా ఎయిడెడ్ టీచర్స్
కుంగిపోతున్నారు. ఈవిషయంలో ఎయిడెడ్ ఉపాధ్యాయ సంఘాలు కూడా యాజమాన్యాలను నిలదీయలేకపోవడంతో ప్రభుత్వ ఉత్తర్వులు నీరుగారుతున్నాయి.
ప్రమోషన్లపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోని కొన్ని
యాజమాన్యాలు డబ్బులు ఎవరు ముట్టజూపితే వారికి మాత్రమే పదోన్నతులు
కల్పిస్తున్నరన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్నాయి. దీంతో తమను ఎంత
త్వరగా ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేస్తే అంత మంచిదని ఉపాధ్యాయులు
దీర్ఘకాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం 5 మంది సభ్యులతో ఏర్పాటు
చేసిన కమిటీ ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వంలోకి విలీనం చేసేలా
ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని ఆశిస్తే, ఎయిడెడ్ పాఠశాలలను
డవప్‌మెంట్ చేయాన్నదానిపై మాత్రమే యాజమాన్యాల అభిప్రాయాలు
సేకరించేందుకు నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపరిచింది.
దీంతో ఎయిడెడ్ ఉపాధ్యాయుల విలీన కథ మళ్లీ మొదటికొచ్చినట్లైయ్యింది.
యాజమాన్యాల అభిప్రాయమంటే ఖచ్చితంగా విలీనం అనేది
ప్రశ్నార్థకమేనని, ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా అంటూ ఉపాధ్యాయులు
పెదవిరుస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల సంఖ్య తక్కవుగా ఉన్న పాఠశాలల
యాజమాన్యాలు మాత్రమే విలీనానికి ఒప్పకునే అవకాశం ఉంది. విద్యార్థుల
సంఖ్య ఎక్కువగా ఉన్న యాజమాన్యాలు తమ ఉనికిని చాటుకునేందుకు
ఎట్టిపరిస్థితుల్లో విలీనానికి ఒప్పుకోరని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
వీరు ఖచ్చితంగా పోస్టులు రిక్రూట్ చేయాలనే డిమాండ్ తెస్తున్నారు. దీని
ప్రకారంగా చూస్తే తమను విలీనం చేయాలని స్వచ్ఛందంగా లేఖలు ఇచ్చిన
పాఠశాలలను మాత్రమే విలీనం చేస్తారా.? ఎయిడెడ్ పాఠశాల డవప్‌మెంట్
పేరుతో యాజమాన్యాల అభిప్రాయాలను స్వీకరించి నాన్చుతారా అనేది
అంతుచిక్కడం లేదని ఉపాధ్యాయులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా ఎయిడెడ్ ఉపాధ్యాయుల విలీనంపై ఇదిగో అదిగో అంటూ ఆశలు చూపడం
తప్పితే పరిష్కార మార్గం చూపకపోవడం ఎన్నటికీ తీరని సమస్యగానే
ఉండిపోవడం ఎయిడెడ్ ఉపాధ్యాయులకు శాపం అనుకోవాల్సిందే.