రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడంలేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్‌డౌన్ 138 రోజుల్లో లక్ష పాజిటివ్ కేసులు నమోదైతే.. గడచిన 12 రోజుల్లో రోజుకు పదివేల పైచిలుకు కేసులతో మరో లక్ష కేసులు దాటేయడం రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఓ వైపు కరోనా నుంచి కోలుకొని వేల మంది డిశ్చార్జి అవుతున్నా.. అంతే సంఖ్యలో కొత్తగా బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు మహారాష్ట్రలో 1,47,048 ఉన్నాయి. అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రం కూడా ఇదే.
ఆ తర్వాతి స్ధానంలో ఆంధ్రప్రదేశ్.. 87,112 యాక్టివ్ కేసులతో దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి. రాష్టరంలో కరోనా దెబ్బకు 2036 మంది మరణించారు. అనధికారిక మరణాల సంఖ్య ఇంకా ఉంటుందన్న విమర్శలూ ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ భారీగానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తొలుత ఆ రాష్ట్రాల్లో భారీ కేసులు నమోదైనా ఆ మేరకు డిశ్చార్జిలు పెరిగాయి. అయితే కరోనా కట్టడి చర్యలతో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది.
కొత్త కేసుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. అయితే, ఏపీలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా డిశ్చార్జిలు పెరిగినా.. యాక్టివ్ సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసుల్లో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. కానీ యాక్టివ్ కేసుల్లో తమిళనాడును ఇప్పుడు ఏపీ దాటేసి రెండోస్థానానికి చేరడం మరింత ఆందోళనక కలిగించే అంశం. ఇదిలా ఉంటే, కరోనా కేసుల్లో ప్రతి 10 లక్షల మందికి 1168 అనేది దేశ సగటు.
ఏపీలో ఇది 4,156గా ఉంది. దేశ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. 7274తో ఢిల్లీ దేశంలో అగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాత ఏపీ నిలిచింది. అత్యధిక కేసులున్న మహారాష్ట్ర, తమిళనాడు కూడా కరోనా కట్టడి చర్యలతో ఊపిరిపీల్చుకుంటున్నాయి. మహారాష్ట్రలో ప్రతి 10 లక్షలకు సగటున 4118 కేసులు ఉంటే, తమిళనాడులో ఈ సంఖ్య 3843, కర్ణాటకలో 2615 కేసులున్నాయి.