గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం జరిగి సుమారు 7 ఎకరాలకుపైగా వరికుప్పలు తగలబడిపోయాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో ఒక రైతు పొలంలో ఎండు గడ్డిని కాల్చేసమయంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న వరి కుప్పలకు మంటలు వ్యాపించాయి. వీస్తున్న గాలికి మంటలు చెలరేగి భారీగా వ్యాపించడంతో స్థానిక రైతులు మంటలను అదుపు చేయలేకపోయారు. సమీపంలో ఉన్న ప్రత్తిపాడు మండల కేంద్రంలో అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే వరికుప్పలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సుమారు గా 7.50 ఎకరాలో వరికుప్పలు కాలిపోయాయి. కొడవలికి చెందిన నాగ భూషణం ఒక ఎకరం, అనభాల నాగరాజు రెండున్నర ఎకరాలు, కోప్పన కృష్ణకు చెందిన ఎకరం, మాచెర్ల సుబ్బారావునకు చెందిన మూడు ఎకరాల వరి కుప్పలు తగలబడినట్టు ప్రాథమికంగా అగ్నిమాపక అధికారులు గుర్తించారు.
