గొల్లప్రోలు, (ADITYA9NEWS) : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని అంతా ఆశపడుతుంటే ఒక్కసారిగా తగ్గిన కేసులు మరలా విజృంభించడం అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు కట్టడి చర్యలు చేపట్టారు. చేబ్రోలు గ్రామంలో కొత్తగా 48 కరోనా కేసులు రావడంతో అప్రమత్తమైన రెవిన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ అధికారులు సంయుక్తంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. చేబ్రోలు గ్రామంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకూ మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. ఉదయం 10 గంటల తరువాత గ్రామం మొత్తం కర్ఫ్యూ ఉండాలని తాజాగా నిర్ణయించిన అధికారులు , నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఒక్క చేబ్రోలు గ్రామంలోనే వారం రోజుల వ్యవధిలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.