ఉరకలేసిన ఉత్తరాంధ్ర!
ప్రజాగళం సభలకు పోటెత్తిన జనం
-
చంద్రబాబుతో గొంతుకలిపి స్పందించిన వైనం
-
ఉత్సాహం నింపిన టీడీపీ అధినేత ప్రసంగాలు
శ్రీకాకుళం( జై తెలంగాణ న్యూస్ ప్రతినిధి ):
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలకు జనం బ్రహ్మరథం పట్టారు. టీడీపీకి కంచుకోటలాంటి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం ఖాయమనిపించేలా చంద్రబాబు సభలకు జనం పోటెత్తారు. సభలు జరిగిన ప్రాంతాల్లో రోడ్లు ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోవటంతో పాటు, చుట్టుపక్కల మేడలు, మిద్దెలపై మహిళలతో సహా వేలాదిగా జనం నిలబడి చేతులూపుతూ చంద్రబాబుకు స్వాగతం పలికారు. రాజాం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన సభలకు జనం వేలాదిగా తరలిరావటమే కాకుండా ప్రసంగాల్లో చంద్రబాబుతో గొంతు కలపటం విశేషం.
చంద్రబాబు ప్రసంగాలు సైతం జనాన్ని ఉత్సాహపరిచేలా సాగాయి. ఎక్కడికక్కడ స్థానిక అంశాలను లేవనెత్తుతూ జనంలో ఆలోచన రేకెత్తించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలు సంధిస్తూ వారినుంచే సమాధానాలు రాబట్టారు. సభలకు హాజరైనవారు సైతం ప్రతిప్రశ్నకు చేతులు ఊపుతూనో, నోటితోనే సమాధానం ఇస్తూ జగన్ పాలనపై తమ వ్యతిరేకతను చాటిచెప్పారు. గత ఐదేళ్లుగా జగన్ విధ్వంసక విధానాలతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఊరట నిచ్చేలా అధికారంలోకి వచ్చాక చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ జనంలో టీడీపీ అధినేత ఉత్సాహం నింపారు.