రూ.218 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత

రూ.218 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత

హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి  కొంపెల్ల మాధవీలత   తన కుటుంబ చర, స్థిరాస్తుల విలువ రూ.218 కోట్లుగా వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇప్పటికే తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వారు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు, అప్పుల వివరాలను కూడా వెల్లడించారు. ఇక హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి  కొంపెల్ల మాధవీలత  తన కుటుంబ చర, స్థిరాస్తుల విలువ రూ.218 కోట్లుగా వెల్లడించారు.

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మాధవీలత బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. తన కుటుంబ చరాస్తుల విలువ రూ. 165.46 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ. 55.92 కోట్లుగా వెల్లడించారు. మొత్తం రూ.27.03 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

విరించి లిమిటెడ్‌, వినో బయోటెక్‌లలో తన పేరిట రూ.8.92 కోట్ల విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్‌ పేరిట రూ.56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా అన్‌లిస్టెడ్‌ కంపెనీలైన గజ్వేల్‌ డెవలపర్స్‌, పీకేఐ సొల్యూషన్స్‌, విరా సిస్టమ్స్‌లలో తన పేరిట రూ.16.27 కోట్ల షేర్లు, తన భర్త పేరిట రూ.29.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు.

ఇక మొత్తం ఇద్దరి పేరిట 5 కిలోల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో 3.9 కిలోలు తన పేరుమీద కాగా, 1.11 కిలోల బంగారు ఆభరణాలు తన భర్త పేరిట ఉన్నట్లు వివరించారు. అయితే, సొంతంగా ఎలాంటి వ్యవసాయ భూములు, వాహనాలు లేవని పేర్కొనడం గమనార్హం. తనపై ఒక క్రిమినల్‌ కేసు కూడా ఉన్నట్లు మాధవీలత తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇక తాను పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసినట్లు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :