జగన్ కోసం కేసీఆర్ తాపత్రయం దేనికంటే …. ?
జై తెలంగాణ న్యూస్ ( డెస్క్ )
బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తాజా ఇంటర్వ్యూలో ‘జగన్ గెలిచి మళ్ళీ ఏపీ సిఎం అవుతారని’ చెప్పారు. వారిరువురి మద్య నేటికీ బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆయన ఏదో యధాలాపంగా ఈ మాట చెప్పలేదు. కేసీఆర్ తన వాక్చాతుర్యంతో నందిని పంది, పందిని నంది అని నమ్మించగల సమర్ధులు. కనుక జగన్ గెలిచి మళ్ళీ సిఎం అవుతారని చెపితే నమ్మేవాళ్ళు అక్కడ హైదరాబాద్‌లో, ఇక్కడ ఏపీలో కూడా కోకొల్లలున్నారు. వారిని ప్రభావితం చేయడానికే కేసీఆర్ ఈవిదంగా అని ఉండవచ్చు. అయితే కేసీఆర్ ఈవిదంగా జోస్యం చెప్పడం వలన హైదరాబాద్‌లో ఆంధ్రా ఓటర్లు లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే ప్రమాదం కూడా ఉందని ఆ పార్టీ అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. అది అప్రస్తుతం. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కేసీఆర్‌కు చాలా అవసరం. గత ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక జగన్‌కు సాయపడ్డారు. ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయి ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నారు కనుక జగన్ ముఖ్యమంత్రి అయితే తనకు సాయపడతారని ఆశించడం సహజమే. జగన్ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ కోరుకోవడానికి మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని ఏదోవిదంగా పడగొట్టి మళ్ళీ సిఎం పదవి చేపట్టాలని కేసీఆర్ చాలా ఆశగా ఉన్నారు. అటు బీజేపీ, ఇటు తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొని తన కల సాకారం చేసుకోవాలని కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కొందరిని ప్రభావితం చేయగల సామర్ధ్యం ఉంది. కనుక జగన్ సహాయ సహకారాలు తీసుకుంటే రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టడం మరింత సులువు అవుతుందని కేసీఆర్ ఆలోచన కావచ్చు. కేసీఆర్ జోస్యం, కలలు ఫలిస్తాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఒకవేళ ఏపీలో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొండంత అండగా నిలుస్తారు. ఇదీగాక టిడిపి, బీజేపీలు మళ్ళీ కలిశాయి. టిడిపి ఎన్డీయే కూడా చేరింది.
కనుక కేంద్రం నుంచి రేవంత్ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు చేయగలరు. అప్పుడు రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి బిఆర్ఎస్ పార్టీనే కబళించి వేసే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఏపీలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ కోరుకోవడం సహజమే. కానీ ఏపీలో మారిన రాజకీయ పరిణామాలు, ప్రజలలో జగన్ ప్రభుత్వం పట్ల నెలకొన్న వ్యతిరేకత నెలకొని ఉన్నందున కేసీఆర్ జోస్యం, జగన్ తోడ్పాటుతో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆయన కల రెండూ ఫలించే అవకాశం కనిపించడం లేదు.