వైసీపి పునాదులను షర్మిల కదిలించగలరా?

వైసీపి పునాదులను షర్మిల కదిలించగలరా?

జై తెలంగాణ న్యూస్ ( ఆంధ్ర ప్రదేశ్ కంటైట్ రైటర్ – పాషా )

జగన్మోహన్‌ రెడ్డి రాజకీయాలలో నిలద్రొక్కుకునేందుకు ఓదార్పు యాత్రలు చేసి, పదేపదే తన తండ్రి వైఎస్ పేరు చెప్పుకునేవారు. తన పార్టీకి కూడా తండ్రి వైఎస్‌ పేరు పెట్టుకుని, ఆయనకు తానే రాజకీయ వారసుడినని ప్రజలు నమ్మించగలిగారు. ఓదార్పు యాత్రలతో రాష్ట్ర రాజకీయాలలో ఓ సరికొత్త ఒరవడి సృష్టించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసి నిర్మించుకున్నారు. అయితే పార్టీ బలపడిన తర్వాత క్రమంగా తండ్రి నామస్మరణ తగ్గించేశారు. అధికారంలోకి వచ్చాక తండ్రి భజన బదులు సొంత భజన చేసుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపి నేతలు చివరికి ప్రజల చేత కూడా భజన చేయించుకుంటున్నారు. కనుక జగన్‌ రాజకీయ ప్రస్థానంలో కాలక్రమేణ వచ్చిన ఈ మార్పు ఆయన రాజకీయ ఎదుగుదలకు ‘గ్రాఫ్’గా భావించవచ్చు. ఈవిదంగా వైసీపికి చాలా బలమైన పునాది వేసి నిర్మించుకున్న తర్వాత ఇక తనకు తిరుగులేదని భావిస్తున్నప్పుడు, అదీ… ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల ప్రవేశంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అసలు సిసలైన వారసులు ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. వైఎస్ షర్మిల వివేకా హత్య విషయంలో తన అన్న జగన్‌ వైఖరిని ప్రస్తావిస్తూ, “బాబాయ్ హంతకులను వెనకేసుకువస్తున్న ఇటువంటివాడు వైఎస్‌కు వారసుడు ఎలా అవుతాడు?” అని ప్రశ్నిస్తున్నారు. వైసీపికి పునాదే వైఎస్ వారసత్వం. ఆ పునాదిని ఆమె దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నట్లు జగన్‌ గ్రహించగానే ఆమె పట్ల మరింత కరుకుగా వ్యవహరించడం ప్రారంభించారు. ఒకప్పుడు ఆమె గురించి మాట్లాడేందుకు వెనకాడే వైసీపి నేతలు ఇప్పుడు నిర్మొహమాటంగా విమర్శిస్తుండటమే ఇందుకు నిదర్శనం. చెల్లి పట్ల జగన్‌ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆమె కట్టుకున్న పసుపు చీర గురించి ప్రస్తావించడమే ఇందుకు నిదర్శనం. అయితే ఆమె “ఏ అన్నా కూడా ఓ చెల్లి గురించి అనకూడని మాట ఇది’ అంటూ సెంటిమెంట్ పండించి మహిళలను ఆకట్టుకోగలిగారు. అది వేరే విషయం. కానీ వైఎస్ షర్మిల రాకతో రెండు అంశాలు మళ్ళీ చర్చకు వచ్చాయి. 1. వైఎస్ వారసత్వం, 2. వివేకా హత్య కేసు.

గతంలో వైసీపికి ఎంతగానో తోడ్పడిన వైఎస్ వారసత్వం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారగా, వివేకా హత్య కేసు ఇప్పుడు వైసీపి మెడకు గుదిబండలా మారింది. వైఎస్ షర్మిల అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోవచ్చు కానీ ఆమె ఖచ్చితంగా వైసీపికి చాలా నష్టం కలిగించబోతోందని చెప్పవచ్చు. కనుక నష్ట నివారణకు జగన్‌ ఏవిదంగా పావులు కదుపబోతున్నారో చూడాలి?

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :