*పోస్టల్ సిబ్బందిని నేరుగా వికలాంగుడికి ఇంటికి తీసుకొచ్చి..
.. ఆధార్ ను సరి చేయించిన వెల్ఫేర్ అసిస్టెంట్
పిఠాపురం,(ADITYA9NEWS): సాధారణంగా ఏవరైనా తమ సమస్యను చెబితే బాధ్యతగా పట్టించుకుని పరిష్కారం చేయడమనేది అసాధారణం. ఏం చెప్పినా మనకెందుకులే అని కొందరు, తన పరిధి కాదంటూ మరికొందరు ఇలా దాట వేయడం తప్పితే, దారి చూపడమనేది అరుదుగా కనిపిస్తోంది. అలాంటిది సమస్యకు దారి చూపడమే కాదు, దగ్గరుండి సమస్య పరిష్కరించిన ఉద్యోగి తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం పట్టణంలోని వెలంపేటలోని 13వ సచివాలయంలో పనిచేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే …అతడి పేరు కందా బుచ్చిరాజు. వెల్పేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వెలంపేటలోని పోలుపర్తి బెన్నయ్య అనే వ్యక్తి చాలా కాలంగా నడుము పనిచేయక వికలాంగత్వంతో మంచానికి పరిమితమయ్యాడు. భార్య కూడా వృద్ధురాలు. వారిని ఎవరూ చూసే దారిలేదు.
పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తే ఆధార్ అపడేషన్, మొబైల్ నెంబర్ అనుసంధానం తప్పనిసరి అని చెప్పారు. దీంతో ఎవరిని అడగాలో తెలియక, ఆధార్ సెంటర్‌కు వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధ దంపతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వెల్పేర్ అసిస్టెంట్ బుచ్చిరాజు దృష్టికి స్థానికులు ఈ సమస్యను తీసుకెళ్లారు. స్పందించిన ఆ ఉద్యోగి, పోస్టల్ సిబ్బందితో మాట్లాడి , వారిని బ్రతిమిలాడి సర్వర్ కిట్‌తో సహా ఆధార్ సామాగ్రిని బాధితుడు బెన్నయ్య ఇంటికి తీసుకొచ్చి ఆధార్ అప్‌డేట్ చేయించాడు. దీంతో బాధితుడు సదరన్ ధరఖాస్తు చేసుకునేందుకు పరోక్షంగా అవకాశం కల్పించాడు రాజు.చాలా కాలం నుండి మంచానికే పరిమితమైన
బెన్నయ్యకు పెన్షన్ అందించే వరకూ పూర్తి సాయం అందిస్తానని , ఇది తన బాధ్యత అని చెబుతున్న రాజు, సేవా స్ఫూర్తిని స్థానికులు, తోటి సిబ్బంది అభినందించారు.
.