రుయా ఆసుపత్రులో మరణాలకు అదే కారణం.
హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్.
అమరావతి, (): ఈ ఏడాది మేలో ఆక్సిజన్ కొరత కారణంగా 23 మంది కోవిడ్ రోగులు తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించినట్లు ధృవీకరిచింది. (శనివారం) ఏపీ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఆక్సిజన్ కొరత గురించి అధికారులు ముందుగానే తెలియజేసి నప్పటికీ , కాంట్రాక్టర్ తగిన సరఫరాను అందించడంలో విఫలమయ్యారని కోర్టుకు నివేదించింది. సకాలంలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఒప్పందం ప్రకారం ఆక్సిజన్ సరఫరా చేయడంలో విఫలమైన భారత్ ఫార్మా ఆక్సిజన్ కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.
23 మంది బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలిపింది.