వీర వేంకట సత్యనారాయణస్వామి భక్తీ ఛానల్ ప్రారంభమంటూ అసత్య ప్రచారం
ఛానల్‌లో ఉద్యోగాలంటూ టోకరాకు ఎర
అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి అంటే తెలియని వారుండరు..రాష్ట్రంలో తిరుమల క్షేత్రం ఎంత ప్రసిద్ధిగాంచిందో అదేస్థాయిలో ప్రసిద్ధి చెందినవాడు తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యదేవుడు.అలాంటి దేవుడినే పెట్టుబడిగా పెట్టుకుని అక్రమ మీడియా వ్యాపారానికి తెరలేపారు కొందరు ప్రబుద్ధులు. తిరుమల భక్తీ ఛానల్ మాదిరిగానే అన్నవరం నుండి రత్నాబ్రాడ్‌కాస్టింగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో, వీర వేంకట సత్యనారాయణస్వామి భక్తీ ఛానల్ త్వరలో వస్తుందని ఆధ్యాత్మిక హిందూ ధర్మాన్ని చాటి చెప్పి భక్తీ భావాలు పెంపొందించే ఏకైక ఛానల్ అంటూ దొంగ ప్రచారానికి ఒడిగట్టారు. ఏకంగా భక్తీ ఛానల్ SVVS పేరుతో సత్యదేవుడిని ప్రతిమ లోగో పెట్టి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇందులో మీడియా రంగానికి సంబంధించిన అన్ని ఉద్యోగాలు ఉన్నాయని ధరఖాస్తుదారులు నవంబర్ 10 లోగా బయోడేటాలను పంపించాలని అడ్రస్ కూడా కోడ్ చేస్తూ పోస్ట్‌లో పేర్కొనడం విశేషం. ఈ పోస్ట్ ప్రస్తుతం తూర్పుగోదావరి మీడియా గ్రూపుల్లో హల్ చల్ చేస్తోంది. చాలా మంది తెలియని వారు భక్తీ ఛానల్ లో ఉద్యోగం అంటే బాగుంటుందనుకుని ధరఖాస్తులు కూడా పంపేస్తున్నారంటే ఒక ఫేక్ మెస్సెజ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్థమవుతోంది.
ఈమొత్తం వ్యవహారంలో సూత్రదారులు నిరుద్యోగులను ఆసరాగా టోకరాకు తెరలేపారా..అధిక విరాళాలిచ్చే భక్తులకే గేలం వేసేందుకు పన్నాగం పన్నారా అనేది అంతుచిక్కని ప్రశ్న. ఓ భక్తీ ఛానల్ పెట్టడమంటే యూట్యూబ్ ఛానల్ పెట్టినంత సులువు అనుకున్నారెమో తెలియదు కాని, అన్నవరం సత్యదేవుని పేరుతో ఆధ్యాత్మిక ఛానల్ ప్రారంభమంటూ ప్రచారం మాత్రం హోరెత్తించడం దేవాధాయశాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది.
దేవస్థానానికి సంబంధం లేదు
ఆలయ ఈవో త్రినాథరావు
అన్నవరంలో భక్తీ ఛానల్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దానికి దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు. భక్తులు ఎవ్వరూ ఇటువంటివి నమ్మొద్దని కోరుతున్నాం. అన్నవరం దేవస్థానం ఎటువంటి ఛానల్ని ప్రారంభించడం లేదు. కొంత మంది ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. దేవాధాయశాఖ అనుమతి లేకుండా అన్నవరానికి సంబంధించి లోగోను, పేరును వాడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.