బీజింగ్,(ADITYA9NEWS): భారత్ అభివృద్ధి చెందాలంటే తమతో వ్యాపారం చేయడమే ఉత్తమ మార్గమమని చైనా ప్రభుత్వ గ్లోబల్ టైమ్స్ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. చైనాను తట్టుకునేంత, దెబ్బతీసేంత శక్తీ భారత్‌కు లేదని తేల్చిచెప్పింది. గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన వ్యాసంలో ఏముందంటే..
చైనా అభివృద్ధి ఏ ఒక్క దేశానికి, ప్రాంతానికి ముప్పుకాదు. చైనాకు అడ్డుకట్టవేసే కుట్రపూరితమైన పథకాలు భవిష్యత్తులో బెడిసికొడతాయి. అమెరికా పివెట్ టూ ఏషియా పాలసీలో భాగంగా ఇండో పసిఫిక్ వ్యూహం అనుసరిస్తున్న దేశాల ఆర్థిక మూల కేంద్రాలు ఆసియా-పసిఫిక్ వైపు మళ్లుతున్నాయి.చైనాను అణచి వేసేందుకు అమెరికా ‘షేర్డ్ వ్యాల్యూస్’ పేరిట ఈ ప్రాంతంలోని పలు దేశాలతో స్నేహసంబంధాలు కొనసాగిస్తోంది. అందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్ అమెరికాకు ఆయుధంగా మారింది.
ఇది భారత్‌కు కొంత లబ్ధి చేకూరి ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు ఉపయోగపడవచ్చు. కానీ, అది చైనాను కట్టడి చేసే స్థాయికి మాత్రం రాలేదు. దీనికి కారణం..ప్రపంచ స్థాయిలో సప్లై ఛైన్ వ్యవస్థ అంతర్జాతీయ నిబంధనలతో పనిచేస్తుంది. ఈ వ్యవస్థను పశ్చిమ దేశాలు ఎంత మాత్రం ప్రభావితం చేయలేవు. చైనాలో కొవిడ్ వ్యాపించినప్పుడు భారత్‌లో చాలా మంది రాజకీయ వేత్తలు ఏవేవో ఉహించుకున్నారు. చైనా స్థానాన్ని అమెరికా సాయంతో ఆక్రమించుకోవచ్చని ఆశపడ్డారు. తర్వాత అవి కలలుగానే మిగిలిపోయాయి.
చైనా.. భారత్‌కు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉండటమే అక్కడి రాజకీయ నాయకులకు ఓ మేలుకొలుపు. చైనా-భారత్ దేశాల బంధం ఇద్దరికీ లబ్ధి చేకూరుస్తుంది. అదే భారత్ అమెరికా పక్షాన చేరితే ఓ పావుగానే మిగిలిపోతుంది. ఇదే విషయం ఐరోపా దేశాలకు వర్తిస్తుంది. ’’ అంటూ కథనం ప్రచురించింది.