తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టీడీపీ నేతలపై పోలీసులు వరుస కేసులు నమోదు చేశారు. ఈనెల 14వ తేదిన కేసులు నమోదైనప్పటికీ ఆలస్యంగా వివరాలు, వెలుగులోకి రావడంతో టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
ఆస్తి పన్నులు పెంపునకు నిరసనగా, పిఠాపురంలో పరిశుభ్రమైన తాగునీరు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించే ప్రయత్నం చేశారు. అయితే కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అపాయింట్ మెంట్ తీసుకున్న తరువాత కూడా కమిషనర్ ఫోన్‌స్విచ్ఛాఫ్ చేయడం దారుణమన్నారు. కమిషనర్ వచ్చి వినతిపత్రం తీసుకునేంత వరకూ కదిలేదిలేదని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో అక్కడకు చేరుకున్న పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాటతో ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయంలో గాంధీ బొమ్మ వద్ద నిరసన తరువాత పోలీసులు వర్మతోపాటు, మరికొంత మందిని స్టేషన్‌కు తరలించారు. తరువాత వ్యక్తిగత పూచికత్తుపై వదిలేశారు.
అంతకముందే కేసులు..బయటకు పొక్కకుండా జాగ్రత్తలు
ఆందోళన జరుగుతున్న సమయంలోనే సీతయ్యగారితోట సచివాలయ వీఆర్వో ద్వారా ఫిర్యాదు స్వీకరించిన , పోలీసులు పలు సెక్షన్ల కింద వర్మతోపాటు 10 మందిపై పలు కేసులు నమోదు చేశారు. అయితే ఈ వివరాలను మూడు రోజుల వరకూ బయటకు రానివ్వలేదు. నిరసన జరుగుతున్న సమయంలోనే కేసులు నమోదు చేసిన పోలీసులు, టీడీపీ నేతలను రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన తరువాత ముందస్తు అరెస్టు కింద కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, సకుమళ్ల గంగాధర్, పాదగయ దేవాలయ ఛైర్మన్ కొండేపూడి ప్రకాష్, నల్లా శ్రీను, అనిశెట్టి సత్యానందరెడ్డి, పిల్లి చిన్న, చిక్కిరెడ్డి రమణ, నూతాటి ప్రకాష్, మాదేపల్లి శ్రీనివాస్, రాయవరపు తిరుమలరావులపై కేసులు నమోదైయ్యాయి.