భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గక ముందే కేరళలో మరో వ్యాధి సంక్రమిస్తోంది. కొజికోడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 20 మందికి ‘షిగెల్లా వ్యాధి’ లక్షణాలు కనిపించాయని, ఈ వ్యాధి కారణంగా ఒకరు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.
కేరళలోని కొజికోడ్ జిల్లా వాసులను షిగెల్లా వ్యాధి వణికిస్తోంది. కొట్టంపరంబ, ముందిక్కల్తాజం ప్రాంతాల్లో దాదాపు 20 మందిలో ఈ కొత్త వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఈ వ్యాధి కారణంగా ఒకరు మృతిచెందినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జిల్లా మెడికల్ అధికారి (డీఎంఓ) సూచించారు. కొజికోడ్ ప్రాంతంలోని నీటి సాంపిల్స్‌ను పరీక్షించేందుకు ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు.
వ్యాధి సంక్రమణ దృష్ట్యా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు జిల్లా అధికారులు. ఇంటింటికీ తిరిగి వ్యాధి గురించి ప్రజలకు వివరించాలని కోరారు. స్థానిక బావుల్లో, నీటి కొళాయిల్లో క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఓఆర్ఎస్లు అందించాలని చెప్పారు.
షిగెల్లా వ్యాధి లక్షణాలు:
జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రథమ లక్షణాలు.
కలుషిత నీరు, పాడైన ఆహారం సేవించడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది.
ఈ వ్యాధి సంక్రమణ ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
షిగెల్లా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. వ్యాధిగ్రస్తుడితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంటాక్ట్‌లోకి వస్తే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కుగా ఉంటాయి .
2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పట్టొచ్చు.
వ్యాధి సోకకుండా తీసుకొవాల్సిన జాగ్రత్తలు:
కాచిచల్లార్చిన నీరు మాత్రమే తాగాలి.
తరచుగా…. సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
మంచి ఆహారం సేవించాలి.
బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయకూడదు.
ఉపయోగించిన డైపర్లను సరైన పద్ధతిలో పడేయాలి.
వ్యాధి లక్షణాలు ఉన్నవారు వంటలు చేయకూడదు.
నీటిని, ఆహార పాత్రలను మూతలతో కప్పి ఉంచాలి.
విరేచనాలు ఉన్న పిల్లలను ఇతరులతో కలవనివ్వకూడదు.
వ్యాధిగ్రస్తులతో కలవకపోవడం శ్రేయస్కరం.
వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఓఆరెస్స్, ఉప్పు ద్రావణం, కొబ్బరి నీరు వంటివి తాగి రీహైడ్రేట్ చేసుకోవాలి