ఆలస్యమైనా, అనుకున్నదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని పేరును ఖరారు చేయడంలో జగన్ మార్క్ స్పష్టమయ్యింది. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపుగా స్థానిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటికే హైకోర్టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలలో ఏకగ్రీవాలకు ఆమోదం తెలపడంతో వార్ వన్‌సైడ్ అయినట్టే. త్వరలో జరగబోయే మిగిలిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలలో పోటీ అనేది ఉంటుందా అనేది కూడా ఆలోచించాల్సిందే. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో జగన్‌కు ఊపీరాడనీయకుండా చేశారన్నది జగమెరిగిన సత్యం.
నిమ్మగడ్డకు చెక్ పెట్టాలన్న జగన్నాటకాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రమేష్‌కుమార్ తనదైన శైలిలో పదవీకాలం పూర్తిచేసుకున్నారు. అనుకున్నట్టుగానే ఎన్నికలను జరిపించేశారు. జగన్ ప్రభుత్వంలో సీఎస్ గా పనిచేసిన నీలంసాహ్నీకి ఎస్ఈసీగా తాజాగా అవకాశం కల్పించడంలో జగన్ ప్రభావం ఉన్నప్పటికీ ఇప్పడు ఫలితమేంటనేది వెయ్యినోళ్ల ప్రశ్న. మరలా 5 సంవత్సరాల వరకూ ఎలాగూ స్థానిక ఎన్నికలు జరగవు. తర్వాత ఈ ప్రభుత్వమే ఉంటే తప్ప ,ఎస్ఈసీగా ప్రభావం ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం కాదనేది సుష్పష్టం. ఎస్ఈసీ తన ప్రభుత్వానికి కలిసొచ్చినా రాకపోయినా ఎన్నికల ప్రక్రియ తర్వాత కూడా ఎస్ఈసీపై జగన్ మాత్రం తన మార్కు చూపించి మరోసారి పట్టు వదలని విక్రమార్కుడవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.










