* CBAS పరీక్ష ను రద్దు చేయండి
* గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం నేతల డిమాండ్
అమరావతి, (ADITYA9NEWS): రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు తమకు ప్రొబిహిషన్ పీరియడ్ పూర్తవుతుందని, పర్మినెంట్ అవుతుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని సచివాలయ రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లం నకు విన్నవించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు పదార్ల సతీష్‌లు కల్లంను కలిసి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు CBAS పరీక్షను ముడిపెట్టవద్దని,గతంలో CBAS పరీక్ష పాస్ అయితేనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని , ఉద్యోగ పరీక్షా సమయంలోగాని, నియామక సమయంలో ఎక్కడా చెప్పలేదని కల్లంకు వివరించారు. CBAS విధానంలో సెక్షనల్ కట్ ఆఫ్ మార్కులు ఇచ్చి పరీక్షను మరింత కఠినతరం చేశారని, ఈ విధానం పట్ల రాష్ట్రం లోని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కల్లంకు వివరించారు. ఈ విధానం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వివరించారు.
ఈ CBAS పరీక్షపై పున పరిశీలించాలని, తక్షణమే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకొని వెళ్ళాలని అజేయ్ కల్లంను ఉద్యోగ సంఘం నాయకులు కోరారు. స్పందించిన కల్లం సచివాలయ వ్యవస్థ జగన్‌కు మానస పుత్రిక వంటిదని, ఉద్యోగులకు ఎటువంటి నష్టం లేకుండా చేస్తామని హామీ ఇచ్చినట్లు సచివాలయాల ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.