అమరావతి(ADITYA9NEWS): పోలీసులకు 2020 సంవత్సరం ఓ ఛాలెంజ్ అని , ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నామని రాష్ట్ర పోలీస్ బాస్ ఏపీ డిజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. 2020 వార్షిక నివేదికను ఆయన మీడియాకు వెల్లడించారు. పోలీసులు ఎదుర్కొన్న ఛాలెంజ్లు చాలా ఉన్నాయన్న డీజీపీ,ప్రభుత్వం తమకు ఎంతగానో సహకరించిందన్నారు. 14వేల మంది ఏపీ పోలీసులు కోవిడ్ బారిన పడ్డారని, 109 మంది ప్రాణాలు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ప్రజల సహకారంతో ముందుండి కరోనాను జయించామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్న సవాంగ్, న్యాయానికి అందరూ సమానమేన్నారు.
ఇప్పటికే మద్యం , ఇసుక మాఫియా కట్టడికి బ్యూరోలను ఏర్పాటు చేసామన్నారు. గత ఏడు నెలల్లో గుర్తించ దగిన 69,688 కేసులు మద్యం అక్రమ రవాణాలో ఎస్ఈబీ ద్వారా నమోదయ్యాయినట్లు డీజీపీ తెలిపారు. మొత్తం 1.94 లక్షల కేసులు ఎస్ఈబీ లో నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కేసుల్లో 102 ప్రభుత్వ అధికారులు, 72 మంది పోలీసులు ఉన్నారని వారిపైనా చర్యలు తప్పవన్నారు.
దిశ పోలీస్‌స్టేషన్ ఏపీ పోలీసుల పనితీరుకు ఓ రోల్ మోడల్ అని దిశ పోలీసులకు ప్రత్యేక వాహనాలు, సాంకేతికతను అందిస్తామన్నారు. ఈ చట్టం ద్వారా త్వరితగతిన న్యాయం చేసేందుకు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దిశ యాప్‌ను అందుబాటులోకి తేవడం జరిగిందని, ఆ యాప్ ఉన్న మొబైల్ మూడుసార్లు షేక్ చేస్తే పోలీసులకు ఆటోమెటిక్ గా సమాచారం వెళుతుందన్నారు.